పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0104-5 సాళంగనాట సంపుటం: 07-023

పల్లవి:
ఆతఁడు నీవు నొక్కటైతే నౌాదురుగాక
యేతున మమ్మంటకు నేమెవ్వరిలోవారము

చ.1:
వంతులకుఁ బెనఁగేవు వద్దు సుమీ నీవు నాతో
యింత పోరితే నీవే యెఱుఁగుదువు
రంతుల నేనేమన్నా రాఁగఁజేసి దూరవద్దు
యెంతకెంత సేసేవు నే మెవ్వరిలో వారము

చ.2:
నేనున్నాడనే వుండేవు నీకిదేమే చలమా
కానీ లేవే మీఁదటెత్తు గనుకొనేవు
పూని మమ్మురేఁచి వట్టి బూమెలు సేయవద్దు
యీ నేరుపులేఁటికి నే మెవ్వరిలోవారము

చ.3:
నన్నుఁ బేరుకొనకుమీ నాయముగాదు నీకు
చిన్నదానవు నేఁజాటి చెప్పితి నీకు
యెన్నికెతో శ్రీ వేంకటేశుఁడు నన్నుఁ గలనె
ఇన్నాళ్ళదాఁకాను నే మెవ్వరిలోవారము