పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0104-4 ఆహిరి సంపుటం; 07-022

పల్లవి:
ఏమి భాగ్యముననో యిటు విచ్చేసితిగాక
వోమి నీయవసరము వొకరికినబ్బునా

చ.1:
కడు విరహినై నిన్నుఁ గన్నులఁ జూచేమంటేను
వడదేరి కొలువు చావడినుందువు
తడవి అక్కడికైన దగ్గరేనంటే నిన్ను
యెడసి నావంటివారు ఎందరైనా వత్తురు

చ.2:
పక్కన నే నీకు విన్నపము సేసుకొనేనంటే
యెక్కడ లేని పరాకు యెప్పుడు నీకు
చెక్కు వట్టి తీసి నిన్ను చేతనెచ్చరించేనంటే
వెక్కసాన నట్టివారు వేవేలు గలరు

చ.3:
పారితెంచి నే నిన్ను బలిమిఁ గూడేనంటే
నేరుతు రందుకుఁ దగు నెపములెల్లా
కోరి శ్రీ వేంకటేశుఁడ కూడితివి నన్ను నిట్టె
యీరితి నలమేల్‌మంగను యిందరుఁ జుట్టాలే