పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0101-1 సామంతం సంపుటం: 07-001

పల్లవి:
అతివ నీయంగములె అతను తాపపు మాటు
తతినొకటికొకటికని దైవమే సేసె

చ. 1:

నిట్టూర్పుగాలికిని నీలాహివేణికిని
నెట్టనను విరహంపునెగులేఁటికే
చుట్టుఁ గన్నీటికిని చూపుఁజాతకములవె
తొట్టి యిఁక మీఁదనవి తుదమీఱఁ గలవా

చ. 2:

చిగిరింత పులకలకు జిగిఁబలుకుఁగోవిలదె
పగటు మరుఘాతలకు వెగటేఁటికే
ఆగడుఁ దాపపురవికి నారనే రాహువదె
తెగి యిందుమీఁదనది దిష్టించఁగలదా

చ. 3:

రతి మనసు మఱపులకు రమణి నీ గోరదివొ
ప్రతిమరునియుద్దముల భ్రమతేఁటికే
యితవైన శ్రీవేంకటేశ్వరుఁడు నినుఁగూడె
చతురతల యివి నిన్ను సాధించఁగలవా