పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0103-3 వరాళి సంపుటం: 07-015

పల్లవి:
ఏకతంబాయనిదె యిద్లరికి నొకచోట
యేకొలఁదిఁ బడునా వలుపేమందునే

చ.1:
ననుపు గలవారికిని నవ్వకుండఁగరాదు
మనసులెనసిన తగులు మానరాదు
చనవు వెగ్గళమైన సరసముల కొదలేదు
తనివి దీరఁడు విభుఁడు తనకు నే నెదురా

చ.2:
మగలకును సతులకును మాటలాడక పోదు
మొగమోట గలచోట మొరఁగ రాదు
పగలేని తావుకును పంతంబు పనిలేదు
తగవులెంచీనతఁడు తనకు నే నెదురా

చ.3:
కూటములు గలయపుడు కొంకు గొసరే లేదు
పాటించి మొక్కఁగాఁ బదరఁదగదు
యీటుతో శ్రీ వేంక టేశుఁడిటు ననుఁ గలసి
తాటించి పాగడీని తనకు నే నెదురా