పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0215-2 శ్రీరాగం సంపుటం: 08-086

పల్లవి:

తలవంచు కొననేలే తరుణి నీకు
యెలమిఁదప్పకచూచీ నిదివో నీవిభుఁడు

చ. 1:

తాలిమిగలచెలికి తలఁపెల్లా నీడేరు
జాలిఁబొరలకున్న చవియౌ మేలు
నాలి నెరపకుండితే నవ్వులు వేళమేవచ్చు
యీలీలనే వుండరాదా యిదివో నీవిభుఁడు

చ. 2:

మాట వొడఁబడికైతే మనసులు గరఁగును
యీటుకుఁ బెనఁగితేను యిచ్చక మవును
కూటములు గలిగితే గుణములు చక్కనవును
యేఁటికి నూరకుందాన విదివో నీవిభుఁడు

చ. 3:

తగవుల నడచితే తప్పదు సంతోషము
మొగమోట గలిగితే మోహముమించు
జిగి యలమేలుమంగ శ్రీవేంకటాద్రివిభుఁని
యెగసక్యాలకే కూడితితఁడే నీవిభుఁడు