పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0215-1 వరాళి సంపుటం: 08-085

పల్లవి:

అంతేసి యెరఁగలేము ఆడువారము
మంతనాన విన్నవించే మన్నించవయ్యా

చ. 1:

నీతో నేమాటాడితే నిజము నిష్ఠూరము
నీతెరిఁగి మాటలెల్ల నీవాడవయ్యా
చేతి మీఁదనే వుండవి చేకొను నామొక్కులెల్లా
మాతలఁపు లీడేరించి మన్నించవయ్యా

చ. 2:

సారె నీతో నవ్వితేనే సరసమే విరసము
నారీతి చూచి నీవే నవ్వవయ్యా
గారవపు నాగోళ్ళు నీగడ్డము పైనుండవి
మారుకొని వేఁడుకొనే మన్నించవయ్యా

చ. 3:

చన్నుల నిన్నొత్తితేనే చలములే పలములు
వున్నతిఁ గాఁగిట నీవే వొత్తవయ్యా
అన్నిటా శ్రీవేంకటేశ అలమేలుమంగ నేను
మన్నించి కూడితివింకా మన్నించవయ్యా