పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0214-4 వసంతవరాళి సంపుటం: 08-082

పల్లవి:

ఆతఁడిదె నీవిదె ఆసలెల్లా నెరవేరె
చేతికి లోనాయఁ బతి చెల్లునమ్మా

చ. 1:

మగఁడు నిన్ను మన్నించె మనసొక్కటాయనిఁక
నగవద్దా యిఁకనీవు నలినాక్షి
మగువలమున్నారము మంకుమీయలుకదీర్చ
జిగినీవు చేసినదే చేఁత యిఁకనమ్మా

చ. 2:

రమణుఁడు చెయి వట్టె రాజసము నీకుఁ దగు
చెమరించ నీకువద్దా చిగురుఁబోఁడి
అమరించఁగలము నీయంకెకు నన్నిపనులు
విమలము నీపగటు విచ్చనవిడెమ్మా

చ. 3:

శ్రీవేంకటేశుఁడు గూడె చెలివలమేల్‌మంగవు
నీ వాతని మెచ్చవద్దా నీలవేణి
చేపదేరె మాకొలువు సేవలిట్టే సేసేము
కైవసమాయ రతులు కళదేరవమ్మా