పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0214-3 ముఖారి సంపుటం: 08-081

పల్లవి:

అవునయ్యా దొరవౌదువన్నిటా నీవు
వివరముతోడి నన్ను వీరిడిఁజేసేవు

చ. 1:

యెవ్వతెనో సరివెట్టేవేఁటికి నాతోఁ జలము
పువ్వువంటి మనసిట్టె పూఁపసేసేవు
జవ్వనమదముతోనే సరినన్నుఁ జేరితేను
నవ్వులనె పొద్దువుచ్చి నాలీసేసేవు

చ. 2:

యెక్కడికైనాఁ బిలిచేవెగసక్కె మెంత నీకు
లక్కవంటి వలుపేల వుక్కుసేసేవు
లెక్కలేని యాసతోడ తెమ్మని నేఁగొసరితే
జక్కవ చన్నులేముట్టి జాగుసేసేవు

చ. 3:

యెంతవడైనాఁ గూడేవేమి నేరుచుకొంటివి
వంతవంటి సిగ్గేఁటికి వాఁకసేసేవు
యింతలో శ్రీవేంకటేశ యిద్దరముఁ గూడితిమి
దొంతిమోవి తేనెలిచ్చి దొరఁజేసేవు