పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0214-2 హిందోళవసంతం సంపుటం: 08-080

పల్లవి:

నేనుసేసే చేఁతలలో నెరుసున్నదా
మీనుల వినుమంటేను వేసరేవుగాక

చ. 1:

కప్పుర మిచ్చితిఁ గాక కవకవ నవ్వితినా
రెప్పల మొక్కితిఁగాక రేసు రేచేఁనా
ముప్పిరినెవ్వతెచేనో ముందువాడివచ్చి
దప్పితో నొక్కటొక్కటే తలచేవుగాక

చ. 2:

చిగురందిచ్చితిఁగాక చేగోరు దాఁకించితినా
మొగమోటనుంటిఁగాక ముంచికైకోనా
మగువ యెవ్వతెచేనో మర్మాలు తొరలి వచ్చి
పగటులనూరకే భ్రమసేవుగాక

చ. 3:

రతులఁ గూడితిఁ గాక రాజసము చూపితినా
సతమై యుండితిఁగాక సాదురీతిని
గతియై శ్రీవేంకటేశ కడపలోఁ గూడితివి
మతి నెవ్వతోఁ దలఁచి మలసేవుగాక