పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0213- 5 సౌరాష్ట్రం సంపుటం: 08-077

పల్లవి:

మనలోనే యింతగద్దా మాఁటి మాఁటికి
వినిపించే వినవయ్యా విన్నిపములెల్లను

చ. 1:

పక్కన నవ్వినప్పుడే భయమెల్లఁ బాసెనీవు
చెక్కు నొక్కినప్పుడే చింత దీరెను
యెక్కువ ప్రియములతో యేల వేడుకొనేవింత
మొక్కే నుండవయ్య నీకు మోహించినదానను

చ. 2:

దండఁ గూచుండినప్పుడే తగవులెల్ల నీడేరె
కొండల చన్నులంటఁగా కోరికె దక్కె
వెండియు నాకెంతేసి వినయాలు సేసేవు
పండేనయ్యా నీవద్ద నేబత్తిగలదానను

చ. 3:

కలసిన యప్పుడే కాయము తనివిఁబొందె
చెలిమి నేసినప్పుడే చెమరించెను
యెలమి శ్రీవేంకటేశ యీడేరితి నీ రతుల
చెలఁగే నిదిగోవయ్య సేవసేసేదానను