పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0212-1 శంకరాభరణం సంపుటం: 08-067

పల్లవి:

ఏమైనానాడేవారి నేమందును
మోము చూచితే చెరువుముయ్యమూకుడున్నదా

చ. 1:

అడియాలముగ నీవు ఆదేవి సత్యాలే కాక
కడు మావంటి వారితోఁ గల్లలాడేవా
జడిసి తొల్లి అసురతులతో నేమో కాక
తడవితే నేటివేళ తప్పు నీయందున్నదా

చ. 2:

చిమ్మిరేఁగ నీవిన్నిటాఁ జేసేవి పుణ్యాలే కాక
పమ్మి నీవొళ్ళ నెంచితే పాపమున్నదా
కుమ్మరించి యీసుద్దులు గొల్లెతలందేమో కాక
నెమ్మది నీపొద్దుకు నింద నీయందున్నదా

చ. 3:

దగ్గరితే నీవల్లను దయదాక్షిణ్యాలే కాక
కగ్గిన నిష్టూర మించుకంతగలదా
వెగ్గళించి నన్నును శ్రీవేంకటేశ కూడితివి
వొగ్గి నిన్నుదూరఁబోతే వొచ్చము నీకున్నదా