పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0211-4 కేదారగౌళ సంపుటం: 08-064

పల్లవి:

ఆయములకెల్లా గురి అతనుని బాణములు
చాయ చూచెకొమ్మనవె జామెక్కెనిపుడు

చ. 1:

తలపోఁతలకు గురి తాననేనూనిద్దరము
పలుకులకెల్లా గురిపంతమొక్కటే
సెలవి నవ్వులకును చెలులిందరును గురి
తెలుకో రమ్మనవే తెల్లవారెనిపుడు

చ. 2:

తగులాయాలకు గురి తననాసందిపొందులు
పగటులకెల్లా గురి పచ్చిసేఁతలు
అగపడ్డందుకు మేని అడియాలములు గురి
మొగమేది రమ్మనవే మువ్వరజామెక్కెను

చ. 3:

ఇచ్చిన కాఁగిళ్ళ గురి యిద్దరితమకములు
విచ్చనవీళ్ళకు గురి వింతరతులు
యిచ్చట శ్రీవేంకటేశుడింతసేసి కూడెనింకా
మచ్చికెతో రమ్మనవే మద్యాన్న మెక్కెను