పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0211-3 మధ్యమావతి సంపుటం: 08-063

పల్లవి:

ఎన్నిటికిఁక దయ యేడనున్నది
వన్నె చిత్తరువు వ్రాసి వనితఁజేసితివా

చ. 1:

చిత్తమెల్ల నీరాయ సిగ్గులెల్ల నెగ్గులాయ
వత్తివలె విరహాన వాడె దేహము
యిత్తల నీవెట్టఁ బొంది యెన్నఁడిఁక వడదేరు
కొత్తగా కరుగుగట్టి కోమలిఁ జేసితివా

చ. 2:

చెమ్మగించె తనువల్లి చెక్కులు చేతికివచ్చె
చిమ్మిరేఁగి పులకలచెట్లు మొలచె
తమ్మివలెఁ జెంగలించె తరి యెన్నఁడిఁక తోలు
బొమ్మకు ప్రాణమువోసి పొలఁతిఁ జేసితివా

చ. 3:

వీడెపు మోవి వెలసె వెగటులెల్లాఁ బాసె
వేడుక రతులచేత విఱ్ఱవీఁగెను
యీడనే శ్రీవేంకటేశ యింతినిట్టే కూడితివి
నీడకు చైతన్యమిచ్చి నెలఁతఁ జేసితివా