పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0201-5 మాళవి గౌళ సంపుటం: 08-005

పల్లవి:

ఏలాతని దూరేవే యింకా నీవు
ఆలీలఁ బుణ్యఫలములవి నీకే వలదా

చ. 1:

గుట్టుతోడ నీమోవి గురుతు సేసినాఁడింతే
తిట్టకువే రమణుని తెరవ నీవు
వట్టిమాకులిగిరించు వనిత నీమాట వింటే
నెట్టన ఆగుణములు నీకు నీకే వలదా

చ. 2:

రేసుల నీచేతులను రెట్టింపు సేయఁగనేలే
ఆసల సాదించకువే ఆతని నీవు
వాసికిఁ బూవకపూచు వనిత నీచేఁతలకు
బాసల నీయందే అవి పతి చూపవలదా

చ. 3:

ముంచి వొత్తిన చన్నుల ముద్రలు వొత్తినాఁడింతే
అంచల శ్రీవేంకటేశుననకు నీవు
యెంచనీతనిఁ గూడితెందైనాఁ గావక కాచు
నించి నీజాణతనాలు నీమీఁదనే వలదా