పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0209-5 ముఖారి సంపుటం: 08-053

పల్లవి:

ఇంకనేల గుట్లు యిన్నియు బయటఁబడె
మంకులెల్లఁదీరె నిఁక మానరాదు పొందులు

చ. 1:

చేసినదెల్లా నీపైచెలి చేసినదిచేఁత
వాసినవి కొనగోరి వాఁతలు నివి
తాసువలె వలపులు తారుకాణలకువచ్చె
మూసి మంతనాలేఁటికి మోహరించె పొందులు

చ. 2:

ఆడినట్టెల్లఁ జెల్లెనంగన మాటనీతో
వేడుక నీ సొమ్మాయ నీ వినోదముల
వీడుదోడై మీనవ్వులు వెన్నెల తేటలుగాసె
యీడనేల మీసిగ్గులు యితవాయ పొందులు

చ. 3:

పట్టినదెల్లాఁ బంతము పడఁతి నీరతులలో
ముట్టినవి చన్నులు నీమొనచేతుల
యిట్టె శ్రీవేంకటేశ యిద్దరును గూడితిరి
ఱట్టుకెక్కె నిందరిలో నాఱడి మీపొందులు