పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0207-6 దేవగాంధారి సంపుటం: 08-042

పల్లవి:

రారే ఆతనినేల రవ్వసేసేరు
దూరించుకోడు వచ్చిసంతోస పెట్టీనిపుడు

చ. 1:

చతురుఁడైనవాఁడు చనవులిచ్చినవాఁడు
సతిఁ గరుణించి మన్నించక మానునా
మతిలోఁ బాయనివాఁడు మనమువెప్పినదాఁక
యితవెరగనిచేఁత లింతసేసీనా

చ. 2:

మాటలాడేయట్టివాఁడు మర్మమెరిఁగినవాఁడు
ఆఁటదానికి బాసిచ్చి అదెరఁగఁడా
సూటిదెలిసినవాఁడు సొలసి యందరిచేత
కూటమిఁ గొసరింపంచుకొనఁ బోయీనా

చ. 3:

శ్రీ వెంకటాద్రివాఁడు చేరి నమ్మించినవాఁడు
యీవనితఁ గలసి తానెరవయ్యీనా
దేవుఁడితఁడైనఁవాఁడు తెరవలు నవ్వేదెల్ల
భావించుకొనుచు మేలే పచరించఁడా