పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0207-5 శ్రీరాగం సంపుటం: 08-041

పల్లవి:

ఇంతయేటికి చాలు నిందరూ వినేరు
రంతుసేయకిపుడిట్టే రావయ్యలోనికి

చ. 1:

కోపములెల్లాఁ బాసె కొఱతలెల్లాఁ దీరె
ఆపొద్దే నీవురాఁగా నలుకమానె
నీపలుకులెల్లావింటి నీవు వేఁడు కొననేల
రాఁపుసేయకిపుడిట్టే రావయ్యలోనికి

చ. 2:

వేసటయించుకలేదు వెరపులు పనిలేదు
సేసలునీవు వెట్టఁగఁ జింతయింకేలా
నీసేఁతలెల్లా మంచివే నిన్నునాడఁజోటులేదు
రాసికెక్కెవలపులు రావయ్యలోనికి

చ. 3:

చెమటలు చల్లనారె చిత్తమువుడుకు వోయ
నెమకి శ్రీవేంకటేశ నీవుగూడఁగా
తమకములిద్దరిని తప్పులెవ్వరికి లేవు
రమణుఁడ నీకు మొక్కే రావయ్యాలోనికి