పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0206-6 పాడి సంపుటం: 08-036

పల్లవి:

నేనేమీననఁ జుమ్మీ నెలఁతలాల
తానకమై సిగ్గువడి తాఁదానే

చ. 1:

అప్పుడు వచ్చేనని యానలు వెట్టినవాఁడు
తప్పని బొంకనివాఁడు తాఁదానే
ముప్పిరి నేనింతలోనే మోముచూచి నవ్వితేను
దప్పిదేర సిగ్గువడీ తాఁదానే

చ. 2:

వుక్కు మీరి విరహాన వుడికించినట్టివాఁడు
తక్కికరుణించేవాఁడు తాఁదానే
ముక్కుమీఁద వేలిడుక మోనమున నేనుండితే
దక్కి సిగ్గుల మునిఁగీ తాఁదానే

చ. 3:

అగపడి రాజసాననట్టె విఱ్ఱవీఁగేవాఁడు
తగిలి కూడినవాఁడు తాఁదానే
జిగిమించి రతులలో శ్రీవేంకటేశ్వరుఁడు
దగదొట్టి సిగ్గువడీ తాఁదానే