పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0205-6 భైరవి సంపుటం: 08-030

పల్లవి:

కంటిమి వింటిమి నీకతలు నేఁడు
నంటుననే ఆసలు సానలఁ బట్టేవా

చ. 1:

కన్నులనే సొలసేవు కాఁకలనే ఆలసేవు
కన్నెరొ నీకాతనికి కలదా పొందు
నన్నునేల మొరఁగేవు నాకునేల దాఁచేవు
సన్నలనే వలపులు చవిగొనేవా

చ. 2:

సెలవులనే నవ్వేవు చెక్కులు చెమరించేవు
మలసి మీ యిద్దరికి మాటలందెనా
చెలఁగి యేల బొంకేవు సిగ్గులేల పెంచేవు
వెలినుండే రతులెల్లా వెలసేసేవా

చ. 3:

భావములనె చొక్కేపు పైపైఁ బులకించేవు
శ్రీవేంకటేశ్వరు మేలు చేకూడెనా
పూవువలెఁ బొదిగేవు బుసకొట్టే వింతలోనె
యీవిధాన నేమిమ్ము యెనయించనేరనా