పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/301

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0250-6 దేశా(సా)క్షి సంపుటం: 08-300

పల్లవి:

ఇంతి నీసొమ్ముగాదా యెరవున్నదా
వింతవారివలె నేము వెంగె మాడేమా

చ. 1:

జగడాలన్నియుఁ దేరె సతి నీతోసంతమాయ
మగుడి మగుడి నీతో మాటలింకానా
తగవరి వవుదువు తప్పులు నీయందు లేవు
మొగము చూచి చూచి మొక్కు లింకానా

చ. 2:

పనులెల్లాఁ జక్కనాయ పదివేలువచ్చె నేఁడు
చెనకి చెనకి నీతో చేఁత లింకానా
వెనకటి వెంతలేవు వేడుకకాఁడవు నీవు
కొనచూపులనుఁ జూచి కొసరు లింకానా

చ. 3:

కోరికలు గొనసాగె కూటములు మీకు నబ్బె
సారె సారెఁ గొరేటి చల మింకానా
యీరీతి శ్రీ వెంకటేశ యిచ్చకుఁడ వన్నిటాను
చేరి నీవు నవ్వఁగాను సిగ్గు లింకానా