పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/298

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0250-3 ధన్నాశి సంపుటం: 08-297

పల్లవి:

మాపుదాఁకాఁ గొసరిన మాను మానే రాయి రాయే
దాపుదండ నీవు నాకు తగవు నీచేతిది

చ. 1:

మొక్కలపు మాటలెల్ల మొన్ననె ఆడితిఁగాని
పుక్కటయిన నిన్ను నేనుఁ బొగడ నేఁడూ
వుక్కువంటి గుండెలోన లక్కవంటి మనసిదే
దక్కియున్నదాన నీకు ధర్మము నీచేతిది

చ. 2:

అంగడిఁ బెట్టినచేఁత లప్పుడెపెట్టితిఁగాని
ముంగిట నీసుద్దులెల్ల మూసేనిపుడు
యెంగిలిసెలవితోన రంగువంటిమనసిదే
పొంగివున్నదాన నీకు పుణ్యము నీచేతిది

చ. 3:

లోచి నిన్నుఁ గూడేది లోననే కూడితిఁగాని
యేచి నిన్నుఁగూడేను యీచాయ నేను
చేచేత నీదేవులను శ్రీవెంకటేశుఁడవు
తాచియున్నదాన దయ దలఁపు నీచేతిది