పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/281

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0247-4 రామక్రియ సంపుటం: 08-280

పల్లవి:

అటుగాన యెంచనేల ఆవలివారి భాగ్యము
యెటులైనా నీపట్టు కెప్పుడును మంచిదే

చ. 1:

తప్పు నీయందున్నదా తగవరి వన్నిటాను
చొప్ప లెత్త బోతేను సూటికిరాదు
కప్పురపు చవిలోన కారములుండునా
కప్పిన విరహులకే కాఁక లౌఁగాదో

చ. 2:

సరవి నీవెరుఁగవా సర్వజ్ఞుఁడవు నీవు
కెరలించఁ బోతేను కిందుపడును
వరుసలఁ బూవులకు వాఁడి తొల్లివున్నాదా
విరసపువేళనే వెల్లివి రౌఁగాదో

చ. 3:

చేకొననివాఁడవా శ్రీ వెంకటేశుఁడవు
కాకుసేయఁ బోతేను గరివడును
యీకడ చంద్రుడు వెట్టా యేలితివి నన్ను నిట్టే
పైకొని అలిగేవారి పాలిటికి అవుఁగాదో