పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/276

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0246-5 సాళంగనాట సంపుటం: 08-275

పల్లవి:

ఇంకాఁ జదువవయ్య యిటువంటివి
లంకెలాయ నీవిద్య లావరివి నైతివి

చ. 1:

పెదవిపై సుద్దులు ప్రియములు బద్దులు
యెదుగాఁ జదివితివి యిపుడు నీవు
వదరు సతులు నీతో(నీతో) వాదించే వారెవ్వరు
తుదకెక్కె నీవిద్య దొడ్డవాఁడ వైతివి

చ. 2:

మంతనపు మంత్రాలు మంకుగోరి యంత్రాలు
యింతగా నేరుచుకొంటి విపుడు నీవు
జంతల సతుల నిన్ను సాధించే వారెవ్వరు
దొంతినున్నది నీవిద్య దొడ్డవాఁడ వైతివి

చ. 3:

ఱట్టయిన సత్యా లాఱడి జోలినిత్యాలు
యిట్టివె నేరుచుకొంటి విపుడు నీవు
గట్టిగా శ్రీవెంకటేశ కాఁగిలించితివి నన్ను
తొట్టెను నీవిద్యలె దొడ్డవాడవైతివి