పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/258

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0243-5 మధ్యమావతి సంపుటం: 08-257

పల్లవి:

తమకించి రమణుఁడు తరిగాచుకున్నవాఁడు
సమరతి వుపరతి సాము సేసేదెవుడే

చ. 1:

చెనకిన చెనకులు సిగ్గులకె కొలఁదాయ
మనసిచ్చి మీలోని మాటలెపుడే
కొనచూపు లన్నియును కోరికకె మొదలాయ
చనవిచ్చ మోవితేనె చవిగొనేదెవుడే

చ. 2:

నగినట్టి నగవులు ననుపులకెపట్టె
పొగరువలపు గడఁబోసేదెవుడే
జిగిమించు వేడుకలు సింగారించనేపట్టె
అగపడ్డ కాఁగిటికి ఆయమిఁకనెపుడే

చ. 3:

కూడిన మీకూటములు గురుతు మేనులనిండె
సూడుఁబాడుఁ బంతాల నించుటయెపుడే
యీడ శ్రీ వెంకటేశు మీ యిచ్చకములె నిండీ
వీడెపుమెచ్చులు మెచ్చేవేళయెపుడే