పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/257

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0243-4 శంకరాభరణం సంపుటం: 08-256

పల్లవి:

పడఁతులు సేసినట్టి భాగ్యముకొద్ది
వుడివోనియట్టి యెన్నో వుద్యోగాలవాఁడవూ

చ. 1:

కొత్త కొత్త సింగారాల కానబుకాఁడవు నీవు
బత్తి వొకరిమీఁదనె పాటించేవా
యిత్తల గొల్లెతలు నాఁడెట్టు వేగించిరో నీతో
మత్తలి నీవైతే వేయి మనసులవాఁడవు

చ. 2:

పొద్దు వోద్దు వేడుకల బూమెలవాఁడవు నీవు
సుద్దు లింతెకాక వొక్కచోటనుండేవా
వుద్దండాలు రాచకూఁతు లోరించి యెట్టుండిరో
గద్దరివై వూరరి కాఁపురాలవాఁడవు

చ. 3:

నిచ్చ నిచ్చఁ బోదిసేసె నేరుపువాఁడవు నీవు
యిచ్చకుఁడవై వొక్క రింటనుండేవా
మచ్చిక శ్రీవెంకటేశ మన్నించి నన్నఁ గూడితి
ముచ్చటతో నందరికి మోహించేవాఁడవు