పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/249

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0242-2 వరాళి సంపుటం: 08-248

పల్లవి:

ఆసపడ్డవారికి నలమట సేయకిఁక
రాసికెక్క మన్నించి రక్షించవయ్యా

చ. 1:

నీమొగము చూచి చెలి నిట్టూర్పు నిగుడించె
యేమో అడుగవయ్య యేకతానను
సామువార సెలవినె నవ్వులు లోలోనదాఁచీ
దీమసాన తలఁపెల్లాఁ దెలుసుకోవయ్య

చ. 2:

చేతికి విడెమిచ్చి చెమరించీ మేనెల్లా
యేతున నేమడిగెనో యియ్యవయ్య
ఆతుమలోఁ గోరి కోరి అట్టె నివ్వెరగందీ
కాతరాన నట్లానె కానిమ్మనవయ్య

చ. 3:

దగ్గరఁ గూచుండి యదె తలవంచీ సిగ్గుపడి
వెగ్గళించ కిఁకఁ దెరవేయవయ్య
కగ్గక శ్రీవెంకటేశ కాఁగిట నిన్నింతి గూడె
వొగ్గినరతులకు నీ వొడిగట్టవయ్యా