పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/248

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0242-1 సాళంగనాట సంపుటం: 08-247

పల్లవి:

ఆడ నీడ నుండఁగా నిన్ననేఁగాక
కూడి యిట్టె వుండితేను కోపగించేనా

చ. 1:

నామొగము చూడుమా నగితేనె కానవచ్చీ
నీ మనసులోననున్న నిజముఁ గల్లా
యేమతకములు నేల యింతేసి ఆనలేల
నామంచముమీఁద నుంటే నమ్మ నే ననేనా

చ. 2:

ముమ్మారునాడుమామాట మొదలనే తెలిసెను
కమ్మిన నీచేఁతల కపటాలెల్లా
సమ్మతించు మననేల చలము సాధించనేల
యిమ్ముల మాయిచ్చనుంటే యీసడించేనా

చ. 3:

కాఁగిలించుకుండుమాకాఁక లోనెముంచుకొని
ఆఁగి పెదవి దడిపె ఆసలెల్లాను
వీఁగనేల యిఁకను శ్రీవెంకటేశ కూడితివి
పాఁగి యిట్టె నెలకొంటె బాసలాడిగేనా