పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0238-6 దేవగాంధారి సంపుటం: 08-228

పల్లవి:

ఎట్టున్నదో నీచిత్తము యెరఁగ విన్నవించేను
గుట్టున నేనుండితేను కోపముగాదుసుమ్మీ

చ. 1:

యెగ్గులేక పతితోడ నెటువంటి వేళనైనా
సిగ్గె మూలధనము చెలులకును
వొగ్గి నీవు సారె సారె నొడివట్టి తియ్యఁగాను
దగ్గర రానైతి నిది తప్పుగాదుసుమ్మీ

చ. 2:

యివ్వల మగవారితోనె మాటలాడినాను
నవ్వె మూలధనము నాతులకును
మవ్వపు సరసమున మానము సోఁకనాడఁగా
రవ్వగాఁ గేరితి నిది రాఁపుగాదుసుమ్మీ

చ. 3:

సారెఁ గొప్పంటిన ప్రాణసఖునితోఁ జెనకఁగ
వోరుపె మూలధనము వువిదలకు
కోరిక శ్రీవెంకటేశ కూడి నన్ను మెచ్చఁగాను
ధీరతనుండితి నంతదిట్టఁగాను సుమ్మీ