పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0238-5 దేసాళం సంపుటం: 08-227

పల్లవి:

ఆడుకోకు నీకునీవే అంతేసి పంతాలు
జాడతోడ మరినవె చాలునయ్వ యిఁకను

చ. 1:

నిగమములై తేను నిలువఁ బెట్టేవాడవు
మగువలతోఁ గల్ల మాటలాడేవా
అగడై అసురకాంతలందుకు సాకిరున్నారు
జగతి సత్యము లవె చాలునయ్యా యిఁకను

చ. 2:

పెరిమ యజ్ఞభాగాలు పెద్దవై ఆరగించేవు
అరిది వెన్నలు ముచ్చి లారగించేవా
యిరవై గొల్లెతలెల్లా నిందుకు సాకిరున్నారు
సరి నట్టి విశ్వాసాలె చాలునయ్య యిఁకను

చ. 3:

జమళి నవ్వుతా నాకు చాఁచె హస్తాలు నీవి
కొమరెలనంటి యెత్తుకొని వచ్చేవా
సమరతి రుకుమిణి సాకిరి శ్రీవెంకటేశ
సముకమైతిమి బొంకుచాలునయ్య యిఁకను