పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0204-2 పాడి సంపుటం: 08-020

పల్లవి:

కాంత నీసందిమోహము గానవచ్చెను
చింతదీర బుజ్జగించి చిత్తగించరాదా

చ. 1:

మొగమునఁ గళదెరె మోవిపైకి నవ్వువచ్చె
మగువ నీతోనేమని మాట చెప్పెనో
సగటున నటునిటు పరాకులేల సేసేవు
తగు విన్నపములవధరించరాదా

చ. 2:

కన్నులఁ దేటలువారె కాయమెల్లాఁ బులకించె
కన్నె నీతోనిఁకనేమి సన్నసేసెనో
చిన్నితేఁతసిగ్గులను శిరసేల వంచేవు
వన్నెల నేకతాన కవసరమీరాదా

చ. 3:

నిలువెల్లఁ జెమరించె నిట్టూరుపులు రేఁగె
కలికి నిన్నెటువలెఁ గాఁగిలించెనో
అలమి శ్రీవేంకటేశ అట్టెనీవు గూడితివి
మలసి యిటువలెనే మన్నించరాదా