పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0233-6 గౌళ సంపుటం: 08-198

పల్లవి:

ఎవ్వరికిఁ గలదయ్య యిటువంటి నేరుపు
దవ్వులనుండఁగా నీవు తావులిచ్చేవు

చ. 1:

వెలఁదు లెవ్వరిఁగన్నా వింతలేదుగాన నీకు
సులభాననే దొరకుఁ జుట్టరికము
మలసి చల్లలమ్ముక మందనుండిరాఁగానే
కలపుకోలుఁదనానఁ గాఁగిలించేవు

చ. 2:

అంగనలఁ గంటే వావులట్టే నీకు దొరకుఁగా
చెంగటనే చెట్టడువఁ జేటఁడేసి
ముంగిటనే పాలుగాఁచి మూలఁ దోడంటువెట్టఁగా
సంగతిగా నప్పుడే మంచమువంచేవు

చ. 3:

పొరుగు సతులుండితే పొరచి వేడకలౌఁగా
దొరకొలుదాసికిఁ బొందులు దాఁతే
యిరవై శ్రీవెంకటేశ యిటు నన్నుఁ గూడితివి
తెరవేసి వలపుల తీపుచల్లేవు