పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0232-6 ముఖారి సంపుటం: 08-192

పల్లవి:

జిగురువంటివాఁడవు చెలులంగటే విడువవు
అగపడి యింటివారు అన్నంతాఁ గలిగెను

చ. 1:

చిక్కని నీమాటలకే చెమరించె మే నెల్లా
తక్కిన చేఁతలు వింటే తలఁపెట్టౌనో
అక్కజపు నీవినయ మాయనాయఁ దనిసితి
మొక్కేనన్నా విడువవు మొలవట్టేవిపుడు

చ. 2:

వెడ నీ నవ్వులకే వెరగందె నిలువెల్లా
అడరి నీవద్దనుంటే నాస యెంతౌనో
మిడిమాలపు నీమెచ్చు మేలుమేలు కైకొంటి
వడి నోపనన్నాఁబోవు వచ్చి కాఁగిలించేవు

చ. 3:

కన్నుల నీచూపులకే గరివడఁ బులకించె
చన్నుల నిన్నొత్తితేను చవి యేరీతో
పన్నిన శ్రీ వెంకటేశ బాపు బాపు కూడితిమి
సన్నసేసినాఁ గొంకపు సారె మన్నించేవు