పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0203-4 కాంబోది సంపుటం: 08-016

పల్లవి:

దవ్వుల విరహమోప దగ్గరి గుట్టును నేర
పువ్వువంటిది నామతి బుద్ధులిఁకఁ జెప్పరే

చ. 1:

తమకించి పొదిగితే తరితీపు చాలదు
జమళి సిగ్గులైతే చవిలేదు
తెమలని వొరపైతే తేఁకువలు మెరయవు
భ్రమసి వుందాన నింకఁ బతితో నేమందునే

చ. 2:

పక్కన నే నవ్వితేను పంతానకు వెలితయ్యా
లక్కవలెఁ గరఁగితే లావు చాలదు
వెక్కసానఁ బెనఁగితే వేసటలు గనమౌను
యెక్కడనున్నదో మేను యిట్లానుందాననే

చ. 3:

తొలుత నేఁ జెనకితే దొమ్ములయ్యీఁ జేఁతలు
తలవంచుకుండితే దంటనందురు
కలసెను శ్రీవేంకట ఘనుఁడింతలో నన్ను
నెలకొంటి సంతసాన నేరుపులింకెట్టివే