పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0203-3 శ్రీరాగం సంపుటం: 08-015

పల్లవి:

ఇంతలోనేమేమి వుట్టునోయింతికి నీవలపుల
చింతదీర విచ్చేసి చిత్తగించవయ్యా

చ. 1:

ఆసల నలపువుట్టెనంగన కించుకించుక
వేసటనెదురు చూచి వెరగువుట్టె
పాసిన తమకమునఁ బరాకులెల్లాఁ బుట్టె
సేసేటి నావిన్నపాలు చిత్తగించవయ్యా

చ. 2:

చెక్కులఁ జెమటవుట్టె చింతతోడ సిగ్గులను
నెక్కొని రానికోపాన నిట్టూర్పు వుట్టె
వెక్కసపు నీగుణాలు వినివేడుకలు వుట్టె
చిక్కెను నీపాలనిదె చిత్తగించవయ్యా

చ. 3:

సెలవుల నవ్వువుట్టె చేరువకు నీవు రాఁగా
కలసిన నీకాఁగిట గర్వము వుట్టె
యెలమి శ్రీవేంకటేశ యిన్నిటా ధైర్యము వుట్టె
చిలుకుఁజెలువములు చిత్తగించవయ్యా