పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0224-5 లలిత సంపుటం: 08-143

పల్లవి:

వినవే విభునిమాట వింతదానవా
చెనకేటి వేళనింత సిగ్గులు వడుదురా

చ. 1:

యీసు లేని వాఁడతఁడు యిచ్చకురాలవు నీవు
తాసులవంటివే నీతలఁపు లెల్లా
సేస వెట్టినాఁడతఁడు చేయివట్టితివి నీవు
వాసులకు నీవుతల వంచుకొందురా

చ. 2:

సరసపు వాఁడతఁడు చాయకు వత్తువు నీవు
సరిబేసి వంటివే మీచనవులెల్లా
తెరవేసినాఁడతఁడు తిరమ్రై నిలిచితివి
శిరసువంచుక నీవు చెక్కు చేతనుందురా

చ. 3:

శ్రీ వెంకటేశుఁడతఁడు శ్రీమహలక్ష్మీవి నీవు
పూవు వాసనవంటివే బుద్ధులెల్లాను
భావించి కూడెనతఁడు పైకొంటి విట్టెనీవు
తావున రతుల నిట్టే తమకింతురా