పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0223-5 మంగళకౌశిక సంపుటం: 08-137

పల్లవి:

కానవచ్చెఁ గదే మీకు కాంతలాల
నాననిచ్చితేనే కొంత నయము వచ్చీని

చ. 1:

మనసులోపలి చింత మాటలోనే కానరాదా
మనసేమి సోదించేవే మగఁడాతఁడు
కొనగొనలనే వద్ద గుట్టుననుండుటే మేలు
పనివడి పిసికితే పవురు వేసీని

చ. 2:

ముంచిన వలపుతీపు మోవిమీఁదఁ గానరాదా
యెంచనేలే గుణాలు ప్రాణేశుఁ డాతఁడు
అంచలనిచ్చకమాడి ఆసలనుండుటేమేలు
కంచముపొత్తుకుఁబోతే కారాలు సోఁకీని

చ. 3:

కాయము సోఁకినరతి కళలోఁ గానరాదా
యేయెడను శ్రీవేంకటేశుఁడాతఁడు
పాయక కూడెనితఁడు పంతముగొనుటే మేలు
వాయఁబోతే కొనగోరు వాఁటాలు సేసీని (?)