పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0222-1 కేదారగౌళ సంపుటం: 08-127

పల్లవి:

ఏమి నేరుచు కొంటివింతేసి నీవు
కామిను లీసుద్దివింటే కాఁకనిన్ను రేఁచరా

చ. 1:

కలసి మెలసి యిట్టే కాంత నిన్ను వేఁడుకోఁగా
అలసి వున్నాఁడనంటా నట్టె వీఁగేవు
వలచిన సతి గాఁగా వడిఁ గిందుపడెఁ గాక
పెలుచు వేరొక్కతయితే పెను ఱట్టుసేయదా

చ. 2:

యిచ్చకములే సేసి యింతి నిన్నుఁ జెనకఁగా
కొచ్చకుమీ మేనంటా గుట్టు సేసేవు
నిచ్చ నీదేవులు గాఁగా నేరమెంచదాయఁ గాక
పచ్చిగా వేరొక్కతైతే బలిమెల్లాఁ జూపదా

చ. 3:

కందువకు నిన్నుఁ బిలిచి కలికి నిన్నుఁ గూడఁగా
అందముగాఁ బరవశమైతిననేవు
యిందునె శ్రీవేంకటేశ యీకె నీవు గాఁగాఁ గాక
సందడి వేరొక్కతైతే చనవు మెరయదా