పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0221-3 పాడి సంపుటం: 08-123

పల్లవి:

లేలే యెక్కడిసుద్ది లేమమాట వినవయ్య
నాలితో రుక్మిణిఁ దెచ్చేనాఁడు లేదా నీకు

చ. 1:

చెలి నిన్నుఁ బిలువఁగ చెయివట్టి తియ్యఁగాను
సెలవి నవ్వులతోడ సిగ్గువడేవు
కొలఁదిమీరనీబుద్ది కొలనిలో గొల్లెతల
నలుగడఁ బైకొనేటినాఁడు లేదా నీకు

చ. 2:

పడతి మోవియ్యఁగాను బలిమి గోరనంటఁగ
అడరి తప్పించుకొనేవప్పటి నీవు
కడఁగి పదారువేలు కాఁగలించుకొనఁగాను
నడుమనే యీబుద్ది నాఁడు లేదా నీకు

చ. 3:

కొమ్మ నినుఁ గూడఁగాను కుచముల నొత్తఁగాను
దొమ్మి శ్రీవేంకటేశ యిందు నలసేవు
యెమ్మెల భుఁవియు సిరి యిరువంకఁ బెండ్లాడఁగ
నమ్మికతో యీబుద్ది నాఁడు లేదా నీకు