పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0202-5 మాళవి గౌళ సంపుటం: 08-011

పల్లవి:

ఏల నన్ను దూరేవే యేమనేవే నన్నును
మేలు మేలని యెప్పుడు మెచ్చవే నీవు

చ. 1:

సేనలు వానిసుద్దులు చెప్పవే నీవెందాఁక
వీనులు చల్లగ నాఁడే వింటినే నేను
తానె యిందు విచ్చేసితే తరవాతిపనులకు
ఐనట్లాఁ దోఁచినమాటాడేనే నేను

చ. 2:

సూటిగాఁ గమ్మటినేల చూచేవే యాతనిదిక్కు
కాటుకకన్నులఁ దొల్లే కంటినే నేను
పాటించి తానిప్పుడు నాపానుపుపైఁ గూచుండితే
చీటికి మాటికి సేవ సేసేనే నేను

చ. 3:

వొడఁబరిచి మమ్మేల వొక్కటి సేసేవే నీవు
కడు వేడుకనప్పుడే కలసితిమే
అడరి శ్రీ వేంకటేశుఁడాయములు నన్నంటితే
చిడుముడిగురులుగాఁ జెనకేనే నేను