పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0220-4 కాంబోది సంపుటం: 08-118

పల్లవి:

కొంత వోరచుకోరాదా కోపగించేమా
బంతినున్న మాగోలు బారచాఁచీనా

చ. 1:

పంతానకే పెనఁగేము పైపై నూరకే నిన్ను
చెంతనుండి యేమైనాఁ జేయవచ్చేమా
వంతులకే సొలసేము వారివీరివలె మరి
దొంతిఁబెట్టి వలపుల దొమ్మిసేసేమా

చ. 2:

ఆలకే పిలిచేము అప్పటి నిన్నిందులోనే
బాసగొని నీకొంగు పట్టుకుండేమా
వాసులకే నవ్వేము వన్నెల నీమేనుచూచి
వేసాలంటా నిన్నునిట్టే వెంగమాడేమా

చ. 3:

సిగ్గులకే లోఁగేము చిత్తడి చెమటలను
కగ్గువెట్టికొని నిన్నుఁ గాఁకరేఁచేమా
నిగ్గుల శ్రీవేంకటేశ నీవెనన్నుఁ గూడితివి
దగ్గరి వుండినదాన తడఁబడేనా