పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0219-5 ధన్నాశి సంపుటం: 08-113

పల్లవి:

నేనేల కాఁగిలించేను నెలఁతనెవ్వతెనైనా
కానుకలాయమోహము కడుమెచ్చవలదా

చ. 1:

మచ్చరములెల్ల మానె మనసొక్కటాయ నాకు
లచ్చనలు నీమోవిపై లలినుండఁగా
చొచ్చి యధరామృతము సొమ్ము పదిలముగాను
పచ్చిముద్రలు వెట్టె నీపని మెచ్చవలదా

చ. 2:

చింతలిన్నియునుఁ బాసె సెలవుల నవ్వువచ్చె
పొంతనుండి నీలోనే బుసకొట్టఁగా
దొంతినున్న వలపులు తూరుపెత్తేవేళలకు
అంతలో పొలివారించె నది మెచ్చవలదా

చ. 3:

చేతికి లోనాయ రతి సేస పిడికిటనిండె
నీతల నన్ను శ్రీవేంకటేశ కూడఁగా
జాతితో నిద్దరమును చద్దికి వేఁడికిఁగాను
యేతులఁ దోడు గడించె నిది మెచ్చవలదా