పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0219-2 లలిత సంపుటం: 08-110

పల్లవి:

నీకు నవ్వులు రావటే నెలఁతల దిక్కుచూచి
దాకొని యింతట మమ్ము దయఁజూడరాదా

చ. 1:

నిండు రాజసముతోడ నీవాతని వద్దనుండి
యెండకన్ను నీడకన్ను నెరిఁగేవటే
వెండియు పతిఁబాసిన విరహపు సతులకు
దుండగవు తలపోఁత దొమ్మిసేసుఁగాక

చ. 2:

మదనరాగముతోడ మగనికాఁగిటనుండి
యెదిటివారినినిన్ను నెరిఁగేవటే
అదనుగాచుక రతికాసపడే యింతులకు
చదురపు తమకము చండిసేసుఁగాక

చ. 3:

శ్రీవేంకటేశ్వరుని చేతికి లోను సేసుక
మావంటివారి నీవు మరచేవటే
యీవేళనే మమ్మునిద్దరు మన్నించితిరి
కైవసపుముదములు కాణాచులౌఁగాక