పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0219-1 మంగళకౌశిక సంపుటం: 08-109

పల్లవి:

కందము విందము దన కతలెల్లాను
పందెమిదే జూజమిదే పలుమారు నేఁటికే

చ. 1:

మగనిముందరనే మాటలాడి నాపెతోను
జగడా లడుతురా సారెసారెకు
తెగువలేమి గల్లాను తెరమరఁగునఁ గాక
మొగము నద్దమునిదే ముందటెత్తు లేఁటికే

చ. 2:

ఆతఁడు చూడఁగానే ఆయాలంటి ఆపెమీఁద
చేతులు చాఁపుదురా చెలరేఁగి
నీతులేమి యెంచినాను నిన్నమొన్ననేకాక
జీతమిదే కొలువిదే సిగ్గులిఁక నేఁటికే

చ. 3:

శ్రీవేంకటేశుఁ బొత్తుల సేసవెట్టే ఆపెను
కావరించి జంకింతురా కనుసన్నల
యీవేళ నన్నుఁగూడె యీతఁడే నానాయకుఁడు
భావమిదే కాయమిదే పలుచేఁత లేఁటికే