పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0202-4 దేసాళం సంపుటం: 08-010

పల్లవి:

చూతువురావయ్యా సుదతికాఁపురము
యీతలనిదె నీయింటిలోనను

చ. 1:

తీపు మోవిలోని తేనెలు గరఁచీ
చూపులకాఁకల చురుకులను
దాపగు చెక్కుటద్దములు దోమీ
పూపుల నవ్వుగప్పురానను

చ. 2:

పులకబియ్యాలఁ బొంగలివెట్టీ
చలి వలపుల చన్నులను
పొలపునెరుల పోరుల వాపీ
ములువాఁడి గోళ్ళ ముచ్చటను

చ. 3:

మొనపి సిగ్గులను ముగ్గులు వెట్టీ
చెనకేటి చెక్కు చేతులను
యెనసె శ్రీవెంకటేశ నిన్నునాపె
కని నీవు రాఁగాఁ గాఁగిటను