పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0218-3 బౌళి సంపుటం: 08-105

పల్లవి:

ఇంకనేఁటివెరపు యిన్నియు మంచివే కాక
సంకెదీర బొమ్మలను సాదించేనా

చ. 1:

వట్టిసిగ్గులు నీకేల వద్దనున్నది వనిత
యెట్టుసేసినా నిన్న దేఁటికనేనా
జట్టిగొన్న నీచేఁతకు సమ్మతింతునేకాక
కట్టఁగడవారివలెఁ గాకుసేసేనా

చ. 2:

మూసి దాఁపిరములేల మోవినున్నవి కెంపులు
నీసుద్దులు వాఁడిసేసి నేరమెంచేనా
వేసినట్టేవేసి నీతో వేడుకపడుఁదుఁగాక
మాసటిలవలె నీతో మారుమలసేనా

చ. 3:

సెలవుల నవ్వులేల చేతికి లోనాయఁ బని
అలరి కూడితివిఁకనడ్డమాడేనా
మలసి శ్రీవేంకటేశ మాలోనిదే ఆపెగాక
వెలుపటివారివలె వింత సేసేనా