పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0218-2 భూపాళం సంపుటం: 08-104

పల్లవి:

ఎగ్గుపట్ట నీకేలే యిందుకుఁగాను
దగ్గరి పైఁ జేయిచాఁచి తమకించరాదా

చ. 1:

వెక్కసాలంతేసి వద్దు విభుఁడు పరాకైతే
యిక్కువలంటఁగరాదా యింకా నీవు
దిక్కులు చూచితేనేమి దేహము నీమీఁదనదే
చిక్కించుక సేయరాని సేఁత సేయరాదా

చ. 2:

అలుకలంతేసి వద్దు ఆతఁడు కొలువైవుంటే
వలపు రేఁచఁగరాదా వన్నైతో నీవు
వెలి విసరిననేమి వెంటనే నీవుందానవు
చలమెల్ల సాదించి జట్టి గొనరాదా

చ. 3:

యెగసక్కేలంతవద్దు యింతలోనే ఆతఁడుంటే
జిగిఁ గాఁగిలించరాదా చెలఁగి నీవు
అగపడి శ్రీవేంకటాధిపుఁడు గూడెనిట్టే
మిగులా నీవు రతుల మెప్పించరాదా