పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0217-3 లలిత సంపుటం: 08-099

పల్లవి:

అన్నియుఁ దెలుకొందమాతఁడే వద్దనున్నాఁడు
మన్నన గనుకొందము మరవకురే

చ. 1:

మనసువచ్చినవారి మాటలే చవులుగాక
యెనయనివారితోడ నేఁటిసుద్దులు
చనవు దానిచ్చితేను సాదించ నేనేరనా
పనిగలయందాఁకాఁ బదరకురే

చ. 2:

జోడుగూడినట్టి వారి చూపులే యింపులుగాక
యీడుగానివారికొసరెంతై నానేమే
వాడికగలయప్పుడు వంచు కొననేరనా
జాడకు వచ్చినదాఁకా చలమేఁటికే

చ. 3:

రతిఁ గూడినట్టివారిరచనలే మెచ్చుగాక
కతలు చెప్పేటివారి గతులేఁటివే
యితవై శ్రీవేంకటేశుఁడింతలోనే నన్నుఁ గూడె
తతివచ్చెనిఁకమీఁద తలవంచనేఁటికే