పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

190

కృష్ణమూర్తి తత్వం


ప్ర : మీరు చెప్తున్నది నాకు అర్థమయింది. మొత్తంగా మన సంపూర్ణ జీవితం గురించి యోచించాలి. ప్రాపంచికాన్ని పారమార్థికమనేదాని నుంచి విడదీయలేము. ఇప్పుడిక ప్రశ్న ఏమిటంటే - జీవితంలోని అన్ని విషయాలలోను పారమార్థికంగా వర్తించడం ఎట్లాగ?

కృ : పారమార్థికంగా వర్తించడం అంటే ఏమిటి? మీరంటున్నది విభజనలు లేకుండా వుండటం - అంటే ప్రాపంచికమని, పారమార్థికమనీ, ఎట్లా వుండాలి, ఎట్లా వుండకూడదు అనీ, యిష్టమూ, రోతా అనే విభజనలు లేని జీవన విధానం అనీ కదూ? ఈ విభజనే సంఘర్షణ. సంఘర్షణతో కూడుకున్న జీవితం పారమార్థిక జీవనం కాదు. సంఘర్షణను బాగా లోతుగా అవగాహన చేసుకుంటేనే పారమార్థిక జీవనం సాధ్యమవుతుంది. ఈ అవగాహనే తెలివి లేదా ప్రజ్ఞ. ఈ తెలివే సరియైన చర్యకు దారి తీస్తుంది. సాధారణంగా అందరూ ఏదో ఒక సాంకేతిక రంగంలో నేర్పునో, వ్యాపారంలో కపటాన్నో, రాజకీయపు కుతంత్రాలనో తెలివి అని అంటూ వుంటారు.

ప్ర : ఇంతకూ అసలు నా ప్రశ్న ఏమిటంటే - సంఘర్షణ లేకుండా ఎట్లా జీవించాలి. ఆవిధంగా ఒక నిజమైన పవిత్ర భావాన్ని పొందడం ఎట్లాగ అన్నది, అయితే యిది మతం అనే ఒక పంజరంలో నిబద్ధం అవడంవల్ల కలిగిన భక్తి అనే భావోద్వేగం కానే కాదు, ఆ పంజరం ఎంత ప్రాచీనమైనదైనా సరే, ఎంతో పూజనీయ మైనదైనా నరే.

కృ : ఎక్కడో ఒక పల్లెటూళ్ళో ఏ సంఘర్షణలూ లేకుండా జీవించే వ్యక్తిగాని, 'పునీతమైన' కొండలమీద ఒక గుహలో కూర్చుని కలలు కంటున్న వ్యక్తిగానీ మనం మాట్లాడుకుంటున్న యిటువంటి పారమార్థిక జీవనం గడపడంలేదని నిస్సందేహంగా చెప్పచ్చు. సంఘర్షణను అంతం చేయడం అనేది మహా సంక్లిష్టమైన విషయాల్లో ఒకటి, దానికి స్వీయ పరిశీలన కావాలి. బాహ్యమైన వాటి ఎడల, ఆంతర్గతమైన అన్నింటి ఎడల ఎరుకగా వుండటం అనే ఒక సున్నితత్వం వుండాలి. మనలో వుండే వైరుధ్యాలను గురించి అవగాహన కలిగినప్పుడే సంఘర్షణ అంతమవుతుంది. మనకు తెలిసినది అంటే గతం; ఆ గతం నుంచి విముక్తి చెందకపోతే యీ వైరుధ్యం ఎప్పటికీ అట్లాగే వుండిపోతుంది. గతం నుంచి విముక్తి అంటే ప్రస్తుతంలో జీవించడం. ప్రస్తుతం కాలానికి సంబంధించినది కాదు. గతం కాని, మనం తెలుసుకున్నది కాని స్పృశించని స్వేచ్ఛాపూరితమైన కదలిక వుంటుంది యీ ప్రస్తుతంలో.

ప్ర : గతాన్నుంచి విముక్తి అంటే ఏమిటి?