సంభాషణలూ, సంవాదాలు
191
కృ : గతం అంటే మనం కూడబెట్టుకున్న జ్ఞాపకాలు. ఈ జ్ఞాపకాలే వర్తమానంలో పనిచేసి భవిష్యత్తుని గురించి ఆశలను, భయాలను తయారుచేస్తున్నాయి. ఈ ఆశలూ, భయాలూ మానసికమైన భవిష్యత్తు. ఇవి లేకుండా భవిష్యత్తు అనేది లేనే లేదు. కాబట్టి వర్తమానం అంటే గతం చేయిస్తున్న పని. మనసు అంటే గతం కలిగిస్తున్న కదలికలు, మనం భవిష్యత్తు అని అంటున్నది గతం వర్తమానంలో పనిచేస్తుండటం వల్ల తయారవుతున్నది. గతం జరుపుతున్న యీ ప్రతిస్పందన అంతా అప్రయత్నంగానే జరుగుతుంటుంది. దానిని రమ్మని ఆజ్ఞాపించడమూ లేదూ, ఆహ్వానించడమూ లేదు. మనం గ్రహించకముందే అది మన మీదకు వచ్చి కూర్చుంటున్నది.
ప్ర : అటువంటప్పుడు దానిని వదిలించుకొని ఎట్లా విముక్తి చెందగలుగుతాం?
కృ : ఎంపిక చేసుకోవడం అనేది లేకుండా యి కదలికలన్నింటి గురించి ఎరుకగా వుండటమే. ఎంపిక చేసుకోవడం అనేది కూడా మళ్ళీ యీ గతం యొక్క కదలికల్లోనిదే అవుతుంది. ఎరుకగా వుండటం అంటే గతం పనిచేయడాన్ని పరిశీలించడం. అటువంటి పరిశీలన గతం యొక్క కదలిక కాదు. ఆలోచన తయారు చేస్తున్న కాల్పనిక బింబాలు లేకుండా పరిశీలించడం - అనే చర్య గతం అంతరించి పోయిన చర్య. ఆలోచన లేకుండా చెట్టును పరిశీలించడం అనే చర్యలో గతం వుండదు. గతం చేస్తున్న చర్యని పరిశీలించడం కూడా గతం అన్నది లేని చర్యే. ఏది మనం చూస్తున్నామో అన్నదాని కంటే చూడటం అనే స్థితి ప్రధానమైనది. ఎంపిక రహితమైన ఆ పరిశీలనలో గతాన్ని గురించి ఎరుకగా వుండటం అంటే ఒక విభిన్నమైన చర్య చేయడమే కాకుండా విభిన్నంగా వుండటం కూడా. ఇటువంటి ఎరుకలో స్మృతి (జ్ఞాపకం} ఏ ఆటంకాలు లేకుండా చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. పారమార్థికత అంటే ఎంపిక చేసుకోవడం ఏమాత్రం లేని ఎరుక; ఇందులో మనం తెలుసుకున్నదాని నుండి స్వేచ్ఛ లభించివుంటుంది; అదే సమయంలో ఆ తెలుసుకున్నది ఎక్కడ పనిచేయాలో అక్కడ పని చేస్తూ వుంటుంది.
ప్ర : కాని మనం తెలుసుకున్నది, మన గతం మనం ఎంత వద్దనుకున్నా పనిచేస్తూ, ఘర్షణకు కారణమవుతూనే వుంటుంది.
కృ : ఆ సంగతి మీరు గ్రహిస్తూ వుంటే అది గతం పనిచేస్తూ వున్నప్పుడు గతం ఎడల క్రియాశూన్యంగా వుండిపోయే స్థితి అన్నమాట. కాబట్టి మనం తెలుసుకున్నదాని నుంచి విముక్తి పొందడమే అసలైన పారమార్థిక జీవనం. అంటే అర్థం తెలుసుకున్న దానిని పూర్తిగా తుడిచిపెట్టేయడం అని కాదు. పూర్తిగా విభిన్నమైన మరొక పరిమాణస్థితి లోనికి ప్రవేశించి, తెలుసుకున్న దానిని పరిశీలించడం. ఎంపిక