పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంభాషణలూ, సంవాదాలు

189


అడపాదడపా కొంత ఆవేదన, కొంత భక్తి తనలో కనబడి మాయమవుతున్నా, అసలు సుఖపడటం కోసమే జీవిస్తున్న మనిషి, తన జీవితకాలమంతటినీ వినోదాలతోను, కాలక్షేపాలతోను గడిపే మనిషి నిస్సందేహాంగా ప్రాపంచిక లోకానికి చెందినవాడే. అతనిలో బుద్ధి చాతుర్యం వుండవచ్చు, పాండిత్యం వుండవచ్చు, ఎప్పుడూ గొప్ప గొప్ప ఆలోచనలు, యితరులు చెప్పినవో, తన స్వంతమైనవో చేస్తుండవచ్చు. అయినా సరే. ఒకరిని ఒక గొప్ప కళ వరిస్తుంది. ఆ కళను అతడు సమాజం కోసమో, తన సంతోషం కోసమో ప్రదర్శిస్తూ వుంటాడు. తనలోని ఆ కళాప్రతిభను సఫలీకృతం చేసుకోవడం ద్వారా గొప్ప కీర్తి కూడా ఆర్జించి వుండవచ్చు. అటువంటి వ్యక్తి కూడా నిస్సందేహంగా ప్రాపంచిక లోకానికి చెందినవాడే. అంతే కాదు. చర్చికి, దేవాలయానికి, మసీదుకి వెళ్ళడం, ప్రార్థనలు చేయడం, స్వమత దురభిమానంలో, పక్షపాతంలో పూర్తిగా మునిగిపోయి, అందులోనూ క్రూరత్వం వున్నదనే గ్రహింపు లేకపోవడం కూడా ఐహిక ప్రపంచానికి సంబంధించినవే. దేశాభిమానం, జాతీయాభిమానం, ఆదర్శవాదమూ కూడా ప్రాపంచిక విషయాలే, ఆశ్రమంలో ముక్కు మూసుకొని కూర్చుని, ఝాము ఝాముకూ లేచి ఒక గ్రంథం చేతబుచ్చుకొని పారాయణం చేస్తూ, ప్రార్థనలు చేస్తూ వుండే వ్యక్తి కూడా నిస్సందేహంగా ప్రాపంచికుడే. లోకంలో మంచి పనులు చేయాలని బయల్దేరేవారు, సమాజ సంస్కర్తలవచ్చు, మత సేవకులవచ్చు - వారికి దేశం గురించి ఆరాటపడే రాజకీయవాదులకీ ఏమీ భేదం లేదు. పారమార్థిక జీవనానికీ, ప్రాపంచిక జీవనానికి మధ్యన ఒక గీత గీసి పెట్టేయడమే ప్రాపంచికత్వంలో వున్న ప్రధాన తత్వం. ఈ సన్యాసుల, మహాత్ముల, సంస్కర్తల మనసులకీ, జీవితంలో సుఖసంతోషాలను మాత్రమే వెతుక్కునే వారి మనసులకీ మధ్యన పెద్దగా భేదమేమీ లేదు.

కాబట్టి జీవితాన్ని ప్రాపంచికమనీ, ప్రాపంచికం కానిదనీ విభజించకుండా వుండటం ముఖ్యం. ప్రాపంచికాన్నీ, పారమార్థికమనీ మనం అనుకునేదానినీ వేరు చేసి చూడకుండా వుండటం ముఖ్యం. ఈ స్థూలప్రపంచం లేకుండా అంటే పదార్థం ప్రపంచం లేనప్పుడు మనమూ వుండం. ఆకాశపు ఆ సౌందర్యం, కొండమీద ఒంటరిగా నిలబడి వున్న ఆ చెట్టు, నడిచి వెళ్తున్న ఆ స్త్రీ, గుర్రపుస్వారీ చేస్తున్న ఆ పురుషుడు - యివన్నీ లేకుండా జీవితం వుండలేదు. మనం ఆలోచించవలసింది యీ మొత్తం జీవితం గురించి తప్ప, అందులోని ఒక ప్రత్యేక భాగం పారమార్థికమైనదనీ, తక్కినవి అందుకు వ్యతిరేకమైనవనీ అనే దృష్టితో కాదు. కాబట్టి పారమార్థిక జీవనం అంటే మొత్తం జీవితాన్ని గురించిన దృష్టి తప్ప, అది ఒక ప్రత్యేకమైన విభాగం కాదని మనం అర్థం చేసుకోవాలి.